Tirumala Tirupati Devasthanams: రూ.1 కోటి విరాళం ఇచ్చే భక్తులకు తిరుమలలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో తెలుసా!

Tirumala Temple Offers Special Privileges for Rs 1 Crore Donors

 


తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి కోటి రూపాయలు విరాళంగా అందించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక సౌకర్యాలు కల్పించనుంది. ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో ఈ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.

కోటి రూపాయల విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలం పాటు... దాతతో సహా వారి కుటుంబ సభ్యులకు (నలుగురికి) ప్రతి సంవత్సరం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.

సంవత్సరంలో మూడు రోజులపాటు సుప్రభాత సేవ, మూడు రోజులపాటు బ్రేక్ దర్శనం, నాలుగు రోజులపాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, ఒక దుప్పటి, ఒక రవికె, 10 మహా ప్రసాదం ప్యాకెట్లు, ఒకసారి వేద ఆశీర్వచనం వంటివి కూడా అందజేస్తారు. అదనంగా, రూ.3 వేలు విలువ చేసే వసతి గదులను మూడు రోజులపాటు ఉపయోగించుకోవచ్చు.

దాతలు జీవితకాలంలో ఒకసారి 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్, 50 గ్రాముల వెండి డాలర్‌ను టీటీడీ కార్యాలయంలో సంబంధిత ఆధారాలు సమర్పించి పొందవచ్చు.

దాతలు కాటేజ్ డొనేషన్ స్కీమ్, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినీ స్కీమ్ (స్విమ్స్) వంటి వివిధ ట్రస్టులకు విరాళాలు ఇవ్వవచ్చు.

విరాళాలు చెల్లించాలనుకునే దాతలు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ http://ttddevasthanams.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. లేదా, ఈవో, టీటీడీ పేరు మీద డీడీ/చెక్ ద్వారా కూడా విరాళం అందజేయవచ్చు. దీనిని తిరుమలలోని దాతల విభాగంలో (డోనర్ సెల్) సమర్పించాల్సి ఉంటుంది.

ఈ మేరకు వివరాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

Tirumala Tirupati Devasthanams
TTD
Venkateswara Swamy
Donation
Tirumala Temple
Special Privileges
Facilities for Donors
B.R. Naidu
Religious Tourism
India
  • Loading...

More Telugu News