ఒకే ఫ్రేమ్‌లో ఇద్ద‌రు దిగ్గ‌జాలు.. రాజ‌స్థాన్‌, చెన్నై మ్యాచ్‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం!

  • గువాహతి వేదికగా నిన్న సీఎస్‌కే, ఆర్ఆర్ మ్యాచ్‌
  • చెన్నైను ఆరు ప‌రుగుల తేడాతో ఓడించిన రాజ‌స్థాన్ 
  • మ్యాచ్ అనంత‌రం ఆస‌క్తిక‌ర ప‌రిణామం
  • ధోనీ, ద్ర‌విడ్ ముచ్చ‌టించ‌డం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
గువాహతి వేదికగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌) త‌ల‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నైను రాజ‌స్థాన్ 6 ప‌రుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. అనంత‌రం 183 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే  20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసి ప‌రాజ‌యం పాలైంది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో సీఎస్‌కే 20 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా... ఆర్ఆర్ బౌల‌ర్ సందీప్ శ‌ర్మ క‌ట్ట‌డి చేయ‌డంతో 13 ర‌న్స్ మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో ఆరు ప‌రుగుల తేడాతో చెన్నై ఓట‌మి చ‌విచూసింది. 

అయితే, మ్యాచ్ అనంత‌రం ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ఇద్ద‌రు క్రికెట్ దిగ్గ‌జాలు క‌ల‌వడం అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, రాజ‌స్థాన్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఒక‌రిని ఒక‌రు ప‌లక‌రించుకుని ముచ్చ‌టించ‌డం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. వీటిపై క్రికెట్ ఫ్యాన్స్ త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు. 

కాగా, ఐపీఎల్‌కు ముందే ద్ర‌విడ్ ఓ చారిటీ మ్యాచ్‌లో ఆడుతూ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. దాంతో కాలికి క‌ట్టుతో వీల్‌ఛైర్‌లోనే జ‌ట్టు శిబిరంలో జాయిన్ అయ్యాడు. అలాగే మ్యాచ్‌ల స‌మ‌యంలోనూ ప్ర‌తి మైదానానికి వెళుతున్నాడు. ఇదే క్ర‌మంలో ఆదివారం గువాహతికి వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా ద్ర‌విడ్ గాయంపై ఎంఎస్‌డీ ఆరాతీశాడు. అదే స‌మ‌యంలో చెన్నైలోని యువ ఆట‌గాళ్ల‌ను ద్ర‌విడ్‌కు ప‌రిచ‌యం చేశాడు. వారితో ద్ర‌విడ్ ఓపిక‌గా షేక్‌హ్యాండ్ ఇవ్వ‌డం విశేషం.  


More Telugu News