ముంబ‌యి ఇండియ‌న్స్‌ ఘోర ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్‌ బోణి

  • అహ్మ‌దాబాద్‌లో ఎంఐ, జీటీ మ్యాచ్‌
  • 36 ర‌న్స్‌ తేడాతో ముంబ‌యిని ఓడించిన గుజ‌రాత్‌
  • తొలి విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఖాతా తెరిచిన జీటీ
అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో నిన్న‌ ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ)తో జ‌రిగిన మ్యాచ్‌లో హోం టీమ్ గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) ఘ‌న విజ‌యం సాధించింది. 36 ప‌రుగుల తేడాతో ముంబ‌యిని మట్టిక‌రిపించింది. గుజ‌రాత్ నిర్దేశించిన 197 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబ‌యి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 160 ర‌న్స్‌కే ప‌రిమిత‌మైంది. ఈ విజ‌యంతో జీటీ పాయింట్ల ప‌ట్టిక‌లో ఖాతా తెరిచింది. 

మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ 8 వికెట్ల‌కు 196 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. సాయి సుద‌ర్శ‌న్ 63, కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ 38, జాస్ బ‌ట్ల‌ర్ 39 ప‌రుగులు చేశారు. ముంబ‌యి బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయ‌గా... ట్రెంట్ బౌల్ట్‌, దీప‌క్ చాహ‌ర్‌, ముజీబ్ రెహ్మాన్‌, స‌త్య‌నారాయ‌ణ రాజు త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం 197 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ముంబ‌యి ఇండియ‌న్స్ ఓవ‌ర్ల‌న్నీ ఆడి 6 వికెట్ల‌కు 160 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆ జ‌ట్టులో సూర్య‌కుమార్ యాద‌వ్ 48, తిల‌క్ వ‌ర్మ 39 మాత్ర‌మే రాణించారు. రోహిత్ శ‌ర్మ 8, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 11 నిరాశ‌ప‌రిచారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్‌ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. గుజ‌రాత్‌కు ఈ సీజ‌న్‌లో ఇదే తొలి విజ‌యం. అటు ముంబ‌యి ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ప‌రాజ‌యం పొంద‌డం గ‌మ‌నార్హం.  


More Telugu News