మా జోలికి వస్తే ఇక అంతే.. పుతిన్‌కు నాటో చీఫ్ మార్క్ రుట్టే హెచ్చరిక

  • మా జోలికి వస్తే వినాశకర పరిణామాలేనన్న నాటో చీఫ్ 
  • పోలాండ్ పర్యటనలో ఉన్న నాటో చీఫ్ కీలక వ్యాఖ్యలు
  • పోలాండ్, ఇతర సభ్యదేశాల భద్రతకు నాటో కట్టుబడి ఉందని స్పష్టీకరణ 
ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో అమెరికా - రష్యాల మధ్య చర్చల్లో మాస్కోదే పైచేయిగా నిలిచే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా రష్యాను ఉద్దేశించి ఆయన హెచ్చరికలు చేశారు.

తమ కూటమిలోని పోలాండ్ లేదా మరేదైనా దేశం జోలికి వస్తే వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. పోలాండ్ పర్యటనలో ఉన్న ఆయన.. పోలాండ్, ఇతర సభ్యదేశాల భద్రతకు నాటో కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తమపై దాడి చేసి తప్పించుకోగలమని ఎవరైనా అనుకుంటే అది తప్పిదమే అవుతుందన్నారు.

అటువంటి వారిపై పూర్తిస్థాయిలో విరుచుకుపడతామని, తమ ప్రతిచర్యతో వినాశకర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పుతిన్‌తో పాటు తమపై దాడి చేయాలనే ఉద్దేశం ఉన్న ఇతరులకు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నానని ఆయన అన్నారు.

ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా, అమెరికాల చర్చల్లో పుతిన్‌కు అనుకూల ఫలితం వస్తుందేమోనని ఐరోపా దేశాల్లో ఆందోళన నెలకొన్న తరుణంలో నాటో చీఫ్ మార్క్ రుట్టే ఈ విధమైన హెచ్చరిక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 


More Telugu News