హామీ నెరవేరింది... సంతోషంగా ఉంది: పవన్ కల్యాణ్

  • పిఠాపురం ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు, అనుమతులు మంజూరు
  • బ్రిడ్జ్ నిర్మాణానికి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చానన్న పవన్
  • నిర్మాణం పూర్తయితే ప్రజల కష్టాలు తీరుతాయని వ్యాఖ్య
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురం ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరయ్యాయి. నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు లభించాయి. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ... తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో తాను ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చానని గుర్తు చేశారు. 

ఉప్పాడ-సామర్లకోట రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ చెప్పారు. ఈ బ్రిడ్జ్ పూర్తయితే వాహన రాకపోకలు సులభతరం అవుతాయని... ప్రజల ప్రయాణ సమయం సులభతరం అవుతుందని అన్నారు. కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి 'సేతు బంధన్' పథకంలో భాగంగా ఈ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు. నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ, కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తికావాలని ఆశిస్తున్నానని తెలిపారు.


More Telugu News