కశ్మీర్ లో ఆక్రమించిన ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే: పాకిస్థాన్ కు భారత్ వార్నింగ్
- ఐరాసలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్
- పాక్ ఆక్రమించుకున్న ప్రాంతం భారత్ లో అంతర్భాగమేనన్న భారత్
- కశ్మీర్ పై అనవసర వ్యాఖ్యలు చేశారని మండిపాటు
శాంతి పరిరక్షణ సంస్కరణలపై ఐక్యరాజ్యసమితిలో చర్చ సందర్భంగా పాకిస్థాన్ ప్రతినిధి మాట్లాడుతూ... కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ... పాకిస్థాన్ అనవసర అంశాలను లేవనెత్తుతోందని మండిపడ్డారు. కశ్మీర్ పై మరోసారి అనవసర వ్యాఖ్యలు చేశారని అన్నారు. పదేపదే ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజమైపోవని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలతో సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని చెప్పారు. కశ్మీర్ లోని కొంత ప్రాంతం ఇప్పటికీ పాక్ ఆక్రమణలోనే ఉందని... దాన్ని పాకిస్థాన్ ఖాళీ చేయాల్సిందేనని అన్నారు. పాకిస్థాన్ కుతంత్రాలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు.