హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ప్రభుత్వ ఖర్చు రూ. 27 కోట్లు
- మే 7వ తేదీ నుంచి 24 రోజులపాటు పోటీలు
- గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆరంభ వేడుకలు
- మే 31న హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్
మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన వివరాలను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జూలియా మోర్లే మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చేందుకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లే మాట్లాడుతూ ఈ పోటీలు అందం కంటే అంతర్జాతీయ సంస్కృతి, సాధికారతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. మిస్ వరల్డ్- 2024 క్రిస్టినా మాట్లాడుతూ.. గతేడాది తాను ఇక్కడే మిస్ వరల్డ్ కిరీటం అందుకున్నట్టు చెప్పారు. తన హృదయంలో ఇండియాకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. చీర కట్టుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని వివరించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పోటీలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.