తెలంగాణ అసెంబ్లీలో పల్లా వర్సెస్ భట్టి
- కాంగ్రెస్ సర్కారు అహంకారంతో వ్యవహరిస్తోందన్న పల్లా
- వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ భట్టి కౌంటర్
- మహిళా వర్సిటీని ఏనాడైనా సందర్శించారా అంటూ ప్రశ్న
పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ.. విద్యాసంస్థలు నడుపుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తారని ఆశించామని, ఆయన మాత్రం అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ పల్లాకు హితవు పలికారు. ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారి దళిత వీసీని నియమించామని, మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో భాగస్వామి అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏనాడైనా మహిళా యూనివర్సిటీని సందర్శించారా అని నిలదీశారు. విద్యాశాఖపై సమీక్ష జరపడానికి సీఎం రేవంత్ రెడ్డికి సమయంలేదంటూ పల్లా చేసిన ఆరోపణలను భట్టి విక్రమార్క కొట్టిపారేశారు. విద్యాశాఖలో తమ ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు.
భట్టి విక్రమార్క ఆరోపణలపై పల్లా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాం (2014-2023) లో 30 మందికి పైగా వీసీలను నియమించినట్లు పేర్కొన్నారు. విద్యాశాఖపై ప్రభుత్వం దృష్టిపెడితే రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నించారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు బడి మానేశారని నిలదీశారు. పేర్లు మార్చడం వంటి చిన్న చిన్న పనులను పెద్దగా చెప్పుకోవడం మాని విద్యాశాఖలో సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లే కేఆర్ఎంబీ నడుస్తోందని ఆరోపించారు. మనకు హక్కుగా రావాల్సిన నీటి వాటాపై పోరాడాలని సీఎం రేవంత్‌రెడ్డికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు.