Gudivada Amarnath: విజయసాయిరెడ్డికి గుడివాడ అమర్ నాథ్ కౌంటర్

Gudivada Amarnath counter to Vijayasai Reddy
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ చుట్టూ కోటరీ ఉందని... ఆ కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యానని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కోటరీని దూరం పెట్టకపోతే జగన్ కు భవిష్యత్తు ఉండదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందిస్తూ విజయసాయిపై సెటైర్లు వేశారు. వైసీపీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలకు... ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు. 

జగన్ చుట్టూ ఉన్న కోటరీ ప్రజలేనని చెప్పారు. అయినా ఏ పార్టీలో కోటరీ ఉండదో చెప్పండని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా? అని అడిగారు. మొన్నటి వరకు కోటరీలో ఉన్న మనమే... ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడితే ఎలాగని అన్నారు. ఒకరి మీద ప్రేమ పుట్టినప్పుడు.. మరొకరిపై ప్రేమ విరిగిపోతుందని చెప్పారు. ఇప్పుడు విజయసాయికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామని అన్నారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం మూడు వర్గాలు ఉన్నాయని... ఒకటి కూటమి వర్గం, రెండోది వైసీపీ వర్గం, మూడోది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం అని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులను అనుభవించిన వాళ్లు ఇప్పుడు పార్టీలు మారుతున్నారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వాళ్లు  వెళ్లిపోయేవారా? అని ప్రశ్నించారు. విజయసాయి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా? అని అడిగారు. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నట్టు అనిపిస్తోందని చెప్పారు.
Go Back to Shorts
Gudivada Amarnath
Jagan
YSRCP
Vijayasai Reddy

More Telugu News