ఇండియాకు స్టార్‌లింక్.. మస్క్ స్పేస్ఎక్స్‌తో జియో ఒప్పందం

  • ఎయిర్‌‌టెల్ ప్రకటించిన ఒక్క రోజు తర్వాత జియో ప్రకటన
  • అంతరాయాల్లేని నెట్‌వర్క్ కోసం స్టార్‌లింక్‌తో జియో ఒప్పందం
  • ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్‌లో పెరుగుతున్న పోటీ
ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌ శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఇండియాకు తీసుకొచ్చేందుకు రిలయన్స్ జియో రెడీ అయింది. ఈ మేరకు స్పేస్ఎక్స్‌తో ఒప్పందం చేసుకుంది. స్టార్‌లింక్‌ను భారత్‌లో విక్రయించేందుకు అవసరమైన ఆమోదం పొందడంపై ఈ ఒప్పందం ఆధారపడి ఉంటుంది. అదే జరిగితే జియో తన స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల ద్వారా స్టార్‌లింక్ సేవలను అందిస్తుంది. 
 
ప్రతి భారతీయుడికి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ చేర్చేందుకు కట్టుబడి ఉన్నామని రిలయన్స్ జియో గ్రూప్ సీఈవో మాథ్యూ ఊమెన్ తెలిపారు. అంతరాయాల్లేని నెట్‌వర్క్ కోసం స్పేస్ఎక్స్ స్టార్‌లింక్‌ను భారత్‌కు తీసుకురావడం కీలక ముందడుగని అన్నారు. 

ఈ భాగస్వామ్యం వల్ల భారతదేశం అంతటా, మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్‌ను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర ఆపరేటర్ల కంటే ఎక్కువ మొబైల్ డేటాను నిర్వహించే జియో.. తన ఇంటర్నెట్ సేవలను బలోపేతం చేయడానికి స్టార్‌లింక్ ఉపగ్రహ నెట్‌వర్క్‌ను వాడుకుంటుంది. స్టార్‌లింక్ వినియోగదారుల కోసం ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్, కస్టమర్ సపోర్ట్ కోసం జియో ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనుంది. 

ఈ ఒప్పందం ద్వారా జియో ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ లైనప్‌కు జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్‌లకు స్టార్‌లింక్ నెట్‌వర్క్ జోడిస్తారు. ఫలితంగా అతి తక్కువ సమయంలో అత్యంత క్లిష్టమైన ప్రదేశాలను కూడా ఇది కవర్ చేస్తుంది. భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ను అందించేందుకు స్పేస్ఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఎయిర్‌టెల్ చెప్పిన ఒక్క రోజులోనే జియో ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పెరుగుతున్న పోటీకి దీనిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  


More Telugu News