కరీంనగర్ నుంచి ప్రతిరోజు తిరుపతికి రైలు నడపండి: అశ్వినీ వైష్ణవ్‌కు పొన్నం ప్రభాకర్ లేఖ

  • భక్తుల రద్దీని దృష్టి పెట్టుకొని రైలును నడపాలని విజ్ఞప్తి
  • శ్రీవారి దర్శనానికి ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళుతున్నారన్న మంత్రి
  • పదేళ్లుగా రైలు కోసం విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడి
తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నుంచి ప్రతిరోజు తిరుపతికి రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళతారని పొన్నం ప్రభాకర్ అన్నారు.

ప్రస్తుతం కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండుసార్లు, గురువారం, ఆదివారం మాత్రమే రైలు వెళుతోందని ఆయన అన్నారు. ఆ ఎక్స్ ప్రెస్ రైలు తిరుపతి నుంచి కరీంనగర్‌కు బుధ, శనివారాల్లో బయలుదేరుతుందని అన్నారు. యూపీఏ హయాంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతికి వెళ్లడానికి వీలుగా ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.

ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఈ నేపథ్యంలో ఈ రైలు ప్రతిరోజు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. గత పదేళ్లుగా ఈ రైలు కోసం విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ లేఖలో గుర్తు చేశారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రైలును నడిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.


More Telugu News