ఎక్సైజ్ కార్యాలయంలో రభస... నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యేపై హైకమాండ్ ఫైర్

  • ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్యెలే చదలవాడ
  • వినతి పత్రాన్ని పరిశీలిస్తామని కమిషనర్ చెప్పినా మాట వినని ఎమ్మెల్యే
  • సీరియస్ గా పరిగణిస్తున్న టీడీపీ అధిష్ఠానం
ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో నానా హంగామా చేసిన నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుపై పార్టీ అధిష్ఠానం మండిపడింది. అరవిందబాబు నిన్న ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి, అక్కడ తన విపరీత చేష్టలతో రభస సృష్టించారు. ఆ సమయంలో ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ కార్యాలయంలో లేరు. 

కాగా, ఎమ్మెల్యే అరవిందబాబు కమిషనర్ ఛాంబర్ లోకి వెళ్లి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. సోఫాలో కొంత సేపు కూర్చుని, ఆపై నేలపై పడుకుని అధికారులను హడలెత్తించారు. అధికారులు తాను చెప్పినట్టు చేయాలన్నారు. 

అసలేం జరిగిందంటే... నరసరావుపేట ఐఎంఎల్ డిపోలో పనిచేస్తున్న 10 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించి, వారి స్థానంలో తాను చెప్పిన వారిని నియమించాలని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ కు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వినతిపత్రం ఇచ్చారు. అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటి గంట. తాను మరో గంటలో వస్తానని, అపాయింట్ మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంచాలని హుకుం జారీ చేశారు. 

వినతి పత్రాన్ని పరిశీలించాల్సి ఉందని కమిషనర్ చెప్పినా, ఎమ్మెల్యే వినిపించుకోలేదు. అక్కడ్నించి వెళ్లిపోయి మళ్లీ 3 గంటల సమయంలో కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కమిషనర్ నిశాంత్ కుమార్ కార్యాలయంలో లేరు. దాంతో అరవిందబాబు రచ్చ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసినా అరవిందబాబు నుంచి స్పందన లేదు. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా అరవిందబాబు వారికి బదులివ్వలేదు. 

చివరికి కమిషనర్ నిశాంత్ కుమార్ కార్యాలయానికి వచ్చి... రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ నరసరావుపేట ఐఎంఎల్ డిపో మేనేజర్ కు ఆదేశాలు ఇవ్వడంతో అరవిందబాబు సంతృప్తి చెంది అక్కడ్నించి నిష్క్రమించారు. 

అరవిందబాబు దాదాపు 3 గంటల పాటు కమిషనర్ కార్యాలయంలో చేసిన రభస టీడీపీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. ఇంత రచ్చ ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నరసరావుపేట ఎమ్మెల్యేని ఆదేశించింది.


More Telugu News