నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

  • తదుపరి విచారణను మే 13 నుండి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
  • నాగం పిటిషన్‌పై గత డిసెంబర్‌లో అఫిడవిట్ దాఖలు చేసిన బీహెచ్ఈఎల్
  • బీహెచ్ఈఎల్ అఫిడవిట్, నాగం రిజాయిండర్‌లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపిన సుప్రీంకోర్టు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, స్వతంత్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను మే 13 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.

నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్ నేపథ్యంలో బీహెచ్ఈఎల్ గత ఏడాది డిసెంబర్‌లో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎత్తిపోతల పథకానికి సంబంధించి సరఫరా చేసిన యంత్రాలు, తమకు వచ్చిన బిల్లుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొంది.

బీహెచ్ఈఎల్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలు తాము చేసిన ఆరోపణలను నిజం చేస్తున్నాయని నాగం జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ టెండర్‌లో మూడో వంతు కూడా బీహెచ్ఈఎల్‌కు చెల్లించలేదని అఫిడవిట్‌లో చెప్పిన అంశాలు వెల్లడిస్తున్నాయని కోర్టుకు తెలిపారు.

బీహెచ్ఈఎల్ దాఖలు చేసిన అఫిడవిట్, దానికి నాగం జనార్దన్ రెడ్డి ఫైల్ చేసిన రిజాయిండర్‌లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. పూర్తి వాదనలు విన్న అనంతరం నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


More Telugu News