Anil Ravipudi: 'సంక్రాంతికి వస్తున్నాం' మరో సంచలనం.. అనిల్ రావిపూడి ఎమోషనల్ పోస్ట్ వైరల్

- టీవీలు, ఓటీటీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' వచ్చేసినప్పటికీ థియేటర్లలో మూవీ హవా
- నేటితో 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమా
- ఇప్పటికే థియేటర్లలో రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు
- చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్
టీవీలు, ఓటీటీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' వచ్చేసినప్పటికీ థియేటర్లలో మూవీ హవా తగ్గలేదు. నేటితో 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఒక రీజినల్ మూవీ విభాగంలో ఇది ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
ఇక సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. తమ సినిమాపై అపారమైన ప్రేమను కురిపించి, బ్లాక్‌బస్టర్ పొంగలు చేసినందుకు ప్రేక్షకులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
92 సెంటర్లలో 50 రోజులు... ఈ మైలురాయి తమ ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల అచంచలమైన అంకితభావంతో సాధ్యమైందని, వారు సినిమాను అన్ని మూలలకు చేరేలా చూశారని అనిల్ పేర్కొన్నారు. ఇక తన హీరో విక్టరీ వెంకటేశ్‌తో ఈ మరపురాని ప్రయాణాన్ని తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు.
చిత్ర నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్, సంగీత దర్శకుడు భీమ్స్, ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన తారాగణం, సిబ్బందికి ఈ సందర్భంగా అనిల్ రావిపూడి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.