టీమిండియా స్పిన్నర్ చాహల్-ధనశ్రీ విడాకుల వార్తల్లో ట్విస్ట్

  • చాహల్-ధనశ్రీ వర్మకు కోర్టు విడాకులు మంజూరు చేసినట్టు ఇటీవల వార్తలు
  • ఆ వార్తల్లో నిజం లేదన్న ధనశ్రీ వర్మ తరపు న్యాయవాది
  • అంతా గందరగోళంగా ఉందన్న చాహల్
టీమిండియా మాజీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడిపోయినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వారిద్దరూ హాజరయ్యారని, కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ విడిపోవడానికే వారు నిర్ణయించుకోవడంతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసిందని జాతీయ మీడియా పేర్కొంది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని, ధనశ్రీ లాయర్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉందని వివరించారు.

ప్రస్తుతం కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయని, విషయం ఇప్పుడు సబ్ జుడీస్ కావడంతో దీనిపై మాట్లాడలేనని ధనశ్రీ తరపు న్యాయవాది అదితీ మోహన్ తెలిపారు. వార్తలు రాసే ముందు మీడియా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని హితవు పలికారు. 

ఈ నేపథ్యంలో చాహల్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా దీనిపై స్పందించాడు. ఇదంతా గందరగోళంగా ఉందని, దయ చూపాలని పేర్కొన్నాడు. కాగా, విడాకుల నేపథ్యంలో ధనశ్రీ వర్మ రూ. 60 కోట్ల భరణం అడిగినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను ఆమె కుటుంబం ఖండించింది. ఇలాంటి నిరాధార వార్తలను ప్రచారం చేయవద్దని మీడియాను కోరింది.  

కాగా, చాహల్ ఇటీవల ఒక సోషల్ మీడియా పోస్టులో.. భగవంతుడు తనను లెక్కలేనన్ని సార్లు రక్షించాడని పేర్కొన్నాడు. తనకు తెలియకుండా రక్షించబడిన సమయాలను కూడా ఊహించగలనని పేర్కొన్నాడు. భగవంతుడు ఎప్పుడూ తనతోనే ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నట్టు తెలిపాడు.

ధనశ్రీ కూడా ఒక మెసేజ్‌ను పంచుకుంది. ‘ఒత్తిడి నుంచి ఆశీర్వాదం వరకు’ అని దానికి క్యాప్షన్ తగిలించింది. మనం పడే బాధలు, ఎదుర్కొనే పరీక్షలను కొంతకాలం తర్వాత దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిసిందని, మీరు ఏదైనా విషయంలో ఒత్తిడి, ఆందోళనకు గురైతే మీకు మరో అవకాశం ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలని, బాధలన్నీ మర్చిపోయి దేవుడిని ప్రార్థించాలని అందులో పేర్కొంది. భగవంతుడిపై మనకున్న విశ్వాసమే మేలు జరిగేలా చేస్తుందని అన్నారు.  


More Telugu News