Nakkina Trinadha Rao: ఆ మాటలకు మా అమ్మ చాలా బాధపడింది: దర్శకుడు నక్కిన త్రినాథరావు

- 'మజాకా' సినీ ఫంక్షన్ లో నటి అన్షుపై దర్శకుడు త్రినాథరావు కామెంట్స్
- బాడీ సైజులు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు
- విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పిన వైనం
- తన తల్లి వారం రోజులు బాధపడిందని తాజాగా వెల్లడించిన దర్శకుడు
ఇటీవల 'మజాకా' సినిమా కార్యక్రమంలో దర్శకుడు నక్కిన త్రినాథరావు నటి అన్షును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. వేదికపై మాట్లాడుతూ అన్షు పేరు మర్చిపోయినట్టు నటించడం, ఆమె బాడీ గురించి కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దాంతో నక్కిన త్రినాథరావు క్షమాపణ కూడా చెప్పారు. ఇదే అంశంపై ఆయన తాజాగా స్పందించారు.
ఆ రోజు తాను వేదికపైమాట్లాడిన మాటలకు తన తల్లి కూడా చాలా బాధపడిందని వెల్లడించారు. తన తల్లి వారం రోజుల పాటు బాధపడడం చూసి తాను కంగారుపడ్డానని తెలిపారు.
"ఆ ఒక్క పదం నిన్ను దుర్మార్గుడ్ని చేసింది కదా నాన్నా అని మా అమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఎందుకు నోరు జారావు నాన్నా అని అడిగింది. నువ్వు చెడ్డవాడివి కావన్న సంగతి నాకు తెలుసు... కానీ నువ్వు మాట్లాడిన మాటలతో అందరూ నిన్ను చెడ్డవాడనుకుంటారు. ఇక నుంచి వేదికలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఎంతో కష్టపడి మంచి దర్శకుడు అనే పేరు సంపాదించుకున్నావు... ఆ మంచి పేరు చెడగొట్టుకోవద్దు అని సూచించింది" అని నక్కిన త్రినాథరావు వివరించారు.
ఇకపై ఇటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని త్రినాథరావు వెల్లడించారు. వాస్తవానికి తాను ఎలాంటి దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఈ సినీ వేడుకకు వచ్చిన వారిని, మీడియా వారిని నవ్వించే ఉద్దేశం ఆ కామెంట్ చేశానని వివరణ ఇచ్చారు.
తాను ఏమన్నదీ నటి అన్షుకు అర్థం కాలేదని, దానిపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో కూడా ఆమెకు అర్థం కాలేదని... ఫోన్ చేసి విషయం అంతా చెప్పానని, దాంతో ఆమె అర్థం చేసుకుందని త్రినాథరావు పేర్కొన్నారు. అన్నింటికంటే తన తల్లి బాధపడడం తనను కలచివేసిందని చెప్పారు.