మరణించిన ఐదు నెలల తర్వాత హిజ్బుల్లా అధినేత నస్రల్లా అంత్యక్రియలు... భారీగా తరలివచ్చిన ప్రజలు

  • బీరుట్‌లో అధికారికంగా హిజ్బుల్లా మాజీ నేత నస్రల్లా అంత్యక్రియలు
  • మద్దతుదారులు, ప్రజలతో పోటెత్తిన బిరూట్ స్టేడియం
  • ఈ సమయంలో గగనతలంపై ఇజ్రాయెల్ యుద్ద విమానాల చక్కర్లు
గత ఏడాది సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్‌ చేపట్టిన దాడుల్లో లెబనాన్ హిజ్బుల్లా అప్పటి అధినేత హసన్ నస్రల్లా (64) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన ఐదు నెలల తర్వాత లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా, ఆయన మద్దతుదారులు, ప్రజలు పోటెత్తారు. 

నస్రల్లా బంధువు, హిజ్బుల్లా వారసుడిగా భావించిన హషీమ్ సఫీద్దీన్‌కు కూడా తుది వీడ్కోలు పలికారు. ఇరువురికీ నివాళులర్పించేందుకు వేలాది మంది తరలి రావడంతో బీరుట్‌లోని స్టేడియం కిక్కిరిసిపోయింది. అదే సమయంలో గగనతలంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. 
 
గత ఏడాది సెప్టెంబర్ నెలలో బీరుట్ దాహియా ప్రాంతంలోని హిజ్బుల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడి చేయగా, నస్రల్లాతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన డిప్యూటి కమాండర్ జనరల్ అబ్బాస్ నీలోఫరసన్ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు జరిగిన మరో దాడిలో సఫిద్దీన్ సైతం మృతి చెందారు. అప్పట్లో ఇద్దరినీ తాత్కాలికంగా రహస్య ప్రదేశంలో ఖననం చేశారు. అయితే, వారికి అధికారిక అంత్యక్రియలు నిర్వహిస్తామని ఇటీవల హిజ్బుల్లా ప్రకటించింది. 
 
ఆ ప్రకటన మేరకు బీరుట్‌లో నస్రల్లా, దక్షిణ లెబనాన్‌లోని స్వస్థలంలో సఫీద్దీన్‌ను ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేసి ప్రజల సందర్శనార్థం ఆదివారం వారి శవపేటికలను బీరుట్‌లోని స్టేడియంకు తరలించారు. ఈ కార్యక్రమానికి 65 దేశాల నుంచి 800 మంది ప్రముఖులు హాజరైనట్లు హిజ్బుల్లా వర్గాలు వెల్లడించాయి.    


More Telugu News