AP Assembly Budget Sessions: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

tight security for ap assembly budget sessions
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలనే ఎజెండాను ఖరారు చేస్తారు. మొత్తం రెండు లేదా మూడు వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

ఈ బడ్జెట్ సమావేశాలకు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని సమాచారం. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, సందర్శకులు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా పాసులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు వివిధ రంగుల కోడ్‌లతో పాసులు జారీ చేశారు.

మండలి ఛైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంకు మాత్రమే అసెంబ్లీ గేట్ 1 నుంచి అనుమతి ఉంటుంది. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇస్తారు. గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేశారు. మండలి ఛైర్మన్, స్పీకర్, ముఖ్యమంత్రులు వచ్చి వెళ్లే కారిడార్‌లోకి ఇతరులెవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. మంత్రులు, సభ్యుల వ్యక్తిగత సహాయకులను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.

ఆయుధాలు, లాఠీలు, ప్లకార్డులు, విజిల్స్ వంటి వాటితో అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశం లేదని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సభ్యులు తమ వ్యక్తిగత సహాయకులను తీసుకుని రావద్దని సూచించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ మినహా ఇతర చోట్ల మీడియా సమావేశాలు నిర్వహించవద్దని సభ్యులకు, మంత్రులకు సూచనలు జారీ చేశారు. శాసనసభ పరిసరాల్లో సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు, బైఠాయింపులు పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. 
Go Back to Shorts
AP Assembly Budget Sessions
Amaravati
Security
YSRCP
YS Jagan

More Telugu News