కశ్మీర్ లోయలో కరవు తప్పదంటున్న వాతావరణ శాఖ

  • కశ్మీరులో ప్రతికూల వాతావరణ పరిస్థితులు
  • జనవరి, ఫిబ్రవరి నెలల్లో 80 శాతం లోటు వర్షపాతం నమోదయిందన్న వాతావరణ శాఖ
  • వేసవిలో కశ్మీర్ లోయ వాసులకు తాగు నీటితో పాటు సాగు నీటి ఇక్కట్లు తప్పవని వెల్లడి  
కశ్మీర్‌కు కరవు ముప్పు పొంచి ఉంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో 80 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా వేసవిలో స్థానికంగా కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

జనవరితో పాటు ఫిబ్రవరి నెలలో కలిపి ఇప్పటి వరకూ 79 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపింది. ఇలాగే పొడి వాతావరణం కొనసాగితే కశ్మీర్ లోయ వాసులకు తాగు నీటితో పాటు సాగు నీటికి ఇక్కట్లు తప్పవని వాతావరణ శాఖ పేర్కొంది.  
 
అంతే కాకుండా, జీలం, ఇతర నదుల్లో సాధారణ నీటి మట్టంతో పోలిస్తే ఈ ఏడాది ఒక మీటరు తక్కువ స్థాయిలో ప్రవాహం ఉన్నట్లు స్థానిక నీటి పారుదల, వరదల నియంత్రణ విభాగ అధికారి ఒకరు తెలిపారు. మరో 15 రోజుల్లో వర్షం లేదా మంచు పడకపోతే పరిస్థితులు మరింత కష్టతరంగా మారే ప్రమాదం ఉందని వెల్లడించారు. 

ఇప్పటికే దక్షిణ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి వనరులు పూర్తిగా ఎండిపోయాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోపక్క మంచు లేకపోవడంతో ఈ నెల 22 నుంచి ప్రారంభం కావాల్సిన ‘ఖేలో ఇండియా’ వింటర్ గేమ్స్‌ను వాయిదా వేశారు. 


More Telugu News