గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
- నేటి నుండి ఆన్ లైన్ లో గ్రూపు 2 మెయిన్ హాల్ టికెట్‌లు
- ఈ నెల 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్‌లైన్ పరీక్షలు
- రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
తొలుత గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఈ ఏడాది జనవరి 5న నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఆ మేరకు పరీక్ష తేదీని ఖరారు చేసింది. అయితే సిలబస్ మార్పుతో పాటు, సన్నద్ధతకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో పరీక్ష తేదీని ఫిబ్రవరి 23కి మార్చింది.
గత ప్రభుత్వం హయాంలో 2023 డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తుకు జనవరి 10, 2024 చివరి తేదీగా నిర్ణయించింది. ఫిబ్రవరి 25, 2024న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది. గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అర్హత సాధించారు. ఫలితాలు వెలువడిన అనంతరం మెయిన్స్ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి.
చివరికి ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 905 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.