వరకట్న చట్టాన్ని మార్చకుంటే నాలాగే రోజూ ఎంతోమంది బలవుతారు!

  • వరకట్న చట్టం దుర్వినియోగం అవుతోందని యువకుడి ఆవేదన
  • లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న ఫొటోగ్రాఫర్
  • యువకులు పెళ్లిళ్లు చేసుకోవద్దని కోరిన వైనం
  • చేసుకోవాలనుకుంటే ముందు అగ్రిమెంట్ రాసుకోవాలని సూచన
  • చట్టంలో మార్పులు చేయాలని విజ్ఞప్తి
వరకట్న నిషేధిత చట్టానికి మరో యువకుడు బలయ్యాడు. తన చావుకు వరకట్న చట్టమే కారణమని లేఖ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. ఫొటోగ్రాఫర్ నితిన్ పడియార్ (28) ఈ నెల 20న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు అతడు రాసిన సూసైడ్ నోట్‌లో ప్రభుత్వానికి పలు సూచనలు చేశాడు. వరకట్న నిషేధిత చట్టంలో మార్పులు తీసుకురావాలని, మహిళలు దానిని దుర్వినియోగం చేయకుండా చూడాలని నితిన్ ఆ లేఖలో కోరాడు. 

‘‘నా పేరు నితిన్ పడియార్. వరకట్న చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి దానిలో మార్పులు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మీరు ఆ పని చేయకుంటే ప్రతి రోజు మరింత మంది పురుషులు, వారి కుటుంబాలు నాశనమైపోతూ ఉంటాయి. యువకులు పెళ్లిళ్లు చేసుకోవద్దని నా మనవి. ఒకవేళ చేసుకోవాలనుకుంటే ముందే అగ్రిమెంట్ రాసుకోండి. నేను వేధింపులకు గురయ్యానని అనుకుంటే నా మరణం తర్వాత నాకు న్యాయం చేయండి. లేదంటే మీ వంతు కోసం వేచి ఉండండి’’ అని నితిన్ ఆ లేఖలో పేర్కొన్నాడు.

ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు నితిన్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఆయన భార్య, ఆమె తల్లి, ఇద్దరు తోబుట్టువులుపై కేసులు నమోదు చేశారు. రాజస్థాన్‌కు చెందిన నితిన్ భార్య అక్కడ తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత కేసును వెనక్కి తీసుకునేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. 


More Telugu News