బీసీసీఐ 'ఫ్యామిలీ' రూల్ పై ఇంగ్లండ్ కెప్టెన్ స్పందన

  • ఇటీవల టీమిండియాకు వరుస ఓటములు
  • కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిన బీసీసీఐ
  • విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట కుటుంబసభ్యులు ఉండే కాలపరిమితి కుదింపు
ఇటీవల టీమిండియా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో,  బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. 45 రోజుల వరకు సాగే విదేశీ టూర్లలో ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులు ఉండే కాల పరిమితిని రెండు వారాలకు కుదించింది. అదే... తక్కువ రోజులు కొనసాగే పర్యటనల్లో ఆ వ్యవధిని వారం రోజులకు తగ్గించింది. 

దీనిపై ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించాడు. రేపటి నుంచి టీమిండియా-ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ పర్యటన కోసం ఇంగ్లండ్ టీమ్ భారత్ చేరుకుంది. 

ఈ సందర్భంగా బట్లర్ మాట్లాడుతూ... విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆటగాళ్లకు కుటుంబ సభ్యుల తోడ్పాటు చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. ఇది మోడ్రన్ యుగం అని, విదేశీ టూర్లకు వెళ్లేటప్పుడు ఆటగాళ్ల వెంట వారి కుటుంబం కూడా వెళితే బాగుంటుందని అన్నాడు. బిజీ క్రికెట్ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లు అత్యధిక సమయం కుటుంబాలకు దూరంగా ఉంటారని, వారికి ఆ లోటు తెలియనివ్వకుండా, పర్యటనలకు కుటుంబాలను కూడా అనుమతించాలని పేర్కొన్నాడు. 

విదేశీ పర్యటనల్లో కుటుంబ సభ్యులు వెంట ఉంటే, అది క్రికెటర్ల ఆటపై ప్రభావం చూపుతుందని తాను భావించడంలేదని బట్లర్ స్పష్టం చేశాడు. కుటుంబ సభ్యులు వెంట ఉండడం క్రికెటర్లను మానసికంగా బలోపేతం చేస్తుందని, ఇంటికి దూరంగా ఉన్నామన్న భావన వారిలో కలగదని వివరించాడు.


More Telugu News