టెస్ట్ క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ సంచలనం.. పొట్టి టెస్టు మ్యాచ్‌లో ఘన విజయం!

  • ముల్తాన్‌లో విండీస్‌తో తొలి టెస్టు మ్యాచ్
  • 127 పరుగుల తేడాతో పాకిస్థాన్ విజయం
  • ఈ టెస్టు నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి నమోదైనవి 1064 బంతులు మాత్రమే
  • పాకిస్థాన్ గడ్డపై జరిగిన అత్యంత పొట్టి టెస్టు మ్యాచ్ ఇదే 
టెస్టు క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ అత్యంత ఘనమైన రికార్డు సాధించింది. అత్యంత తక్కువ ఓవర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో పాక్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముల్తాన్‌లో విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 68.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. 

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 25.2 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 251 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 36.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటై ఓటమి మూటగట్టుకుంది. 

టెస్టు క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్‌లో జరిగిన అత్యంత పొట్టి మ్యాచ్ ఇదే. ఇందులో ఘన విజయం సాధించడం ద్వారా పాక్ రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి మొత్తం 1064 బంతులు మాత్రమే ఆడాయి. 2024లో రావల్పిండిలో ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1233 బంతుల్లో ముగిసింది. 2001లో ముల్తాన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1183 బంతులు మాత్రమే నమోదయ్యాయి. 

లాహోర్‌లో 1986లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 1136 బంతులు, 1990లో ఫైసలాబాద్‌లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 1080 బంతులు నమోదు కాగా, అదే జట్టుతో ఇప్పుడు జరిగిన మ్యాచ్‌లో అతి తక్కువగా 1064 బంతులు మాత్రమే నమోదయ్యాయి. ఫలితంగా పాకిస్థాన్‌లో జరిగిన అత్యంత పొట్టి టెస్టు మ్యాచ్‌గా ఇది రికార్డులకెక్కింది. 


More Telugu News