ఎంపీతో టీమిండియా క్రికెట‌ర్‌ రింకూ సింగ్ పెళ్లి.. ఆమె తండ్రి ఏమ‌న్నారంటే..!

  • రింకూ, ఎంపీ ప్రియా సరోజ్‌ల‌కు నిశ్చితార్థం జరిగినట్లు నెట్టింట‌ పుకార్లు
  • ఈ రూమ‌ర్ల‌పై తాజాగా స్పందించిన‌ ఆమె తండ్రి తుఫాని సరోజ్
  • వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనే కోరికను త‌మ‌వ‌ద్ద వ్యక్తం చేశారన్న సమాజ్‌వాదీ పార్టీ నేత‌ 
  • ఇంకా నిశ్చితార్థం జరగలేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయని వెల్ల‌డి
టీమిండియా యువ ఆట‌గాడు రింకూ సింగ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ల‌కు నిశ్చితార్థం జరిగినట్లు సోష‌ల్ మీడియాలో పుకార్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ రూమ‌ర్ల‌పై ఆమె తండ్రి తుఫాని సరోజ్ తాజాగా స్పందించారు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశారని, అయితే నిశ్చితార్థం ఇంకా జరగలేదని స్ప‌ష్టం చేశారు. 

సమాజ్‌వాదీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ప్రియా తండ్రి తుఫాని సరోజ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఇద్దరూ పెళ్లి విష‌య‌మై తమ అనుమతిని కోరినట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఇంకా నిశ్చితార్థం జరగలేదని, ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయని ఆయన ధృవీకరించారు.

"పిల్లలిద్దరూ పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. దాని కోసం మా అనుమతిని కోరారు. ఇంకా నిశ్చితార్థం జరగలేదు. దీనికి సంబంధించి ప్రాథమిక చర్చలు జరిగాయి" అని తుఫాని సరోజ్ ఏఎన్ఐతో చెప్పారు.

ఇక‌ రింకూ సింగ్ పొట్టి ఫార్మాట్‌లో టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే. అయితే, వ‌న్డేల్లో మాత్రం ఇంకా అత‌నికి చోటు ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం తీవ్ర‌మైన పోటీ ఉన్నందున 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌లో రింకూకు చోటు ద‌క్క‌డం కొంచెం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. 

కాగా, లిస్ట్-ఏ క్రికెట్‌లో మాత్రం అత‌డు అద్భుత‌మైన గ‌ణాంకాల‌ను కలిగి ఉన్నాడు. 52 ఇన్నింగ్స్‌లలో 48.69 సగటు, 94.8 స్ట్రైక్‌రేట్‌తో 1,899 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శ‌త‌కం, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

కాగా, భార‌త జ‌ట్టు త‌ర‌ఫున ఇప్ప‌టివ‌ర‌కు 30 టీ20లు ఆడిన రింకూ సింగ్‌ 22 ఇన్నింగ్స్‌లలో 46.09 సగటు, 165.14 స్ట్రైక్ రేట్‌తో 507 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. 2023లో ఐర్లాండ్‌పై మ్యాచ్ ద్వారా టీ20ల్లో అరంగేట్రం చేశాడు.

అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కు రింకూ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఐపీఎల్‌లో 46 మ్యాచ్‌లు ఆడాడు. 143.33 స్ట్రైక్ రేట్‌తో 893 పరుగులు చేశాడు. ఈ క్యాష్ రిచ్ టోర్నీలో అతడు నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు.


More Telugu News