Harish Rao: కేటీఆర్ ను ఈడీ విచారిస్తున్న వేళ ఢిల్లీకి బయల్దేరిన హరీశ్ రావు!

---
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను గురువారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఓవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ జరుగుతుండగా హరీశ్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీశ్ రావు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు.. ఈ పర్యటనతో ఏం జరగనుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. కాగా, ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారని కేటీఆర్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు తిరస్కరించింది. దీనిపై కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలలో కలగజేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్ తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలో గురువారం కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో ఈ రోజు కేటీఆర్ ను ఈడీ అధికారులు అరెస్టు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.