Harish Rao: పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు

Harish Rao fires at Padi Koushik Reddy arrest
షార్ట్స్‌లో చూడండి
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, దీనిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే కౌశిక్ రెడ్డిపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయమన్నారు.

ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించడం, నిలదీస్తే పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు, హామీల అమలు, పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని ఆరోపించారు.

ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు, అడిగితే అరెస్ట్‌లు... ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని నిలదీశారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి... ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. తద్వారా ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారని దుయ్యబట్టారు.

మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు... బెదరదన్నారు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Harish Rao
Padi Kaushik Reddy
Revanth Reddy
Telangana
BRS

More Telugu News