Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలి: గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes all the best for Game Changer
Advertisement
  • రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా గేమ్ చేంజర్
  • సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం
  • ఈ నెల 10న రిలీజ్
  • రాజమండ్రిలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Advertisement
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమండ్రిలో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... "గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు. ఈవెంట్‌ను వీక్షిస్తున్న ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు. అలానే పవన్ కల్యాణ్ అభిమానులకు కూడా నమస్కారాలు (నవ్వుతూ). 

శంకర్ గారు చేసిన జెంటిల్మన్ సినిమాను చెన్నైలో చూశాను. ప్రేమికుడు సినిమాకు అమ్మమ్మతో వెళ్లాను. సామాజిక సందేశాన్ని అందిస్తూ శంకర్ గారు సినిమాలు తీస్తుంటారు. ఈ రోజు రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్థాయికి వెళ్లారు. దానికి కొంత మంది సౌత్ దర్శకులు కారణం. అందులో శంకర్ గారు ఒకరు. తమిళంలో శంకర్ గారు సినిమాలు తీసి తెలుగు వారిని మెప్పించారు. ఆయన తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాను.

ఇక దిల్ రాజు గారు నా తొలిప్రేమ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు వకీల్ సాబ్ సినిమా ఇచ్చారు దిల్ రాజు. ఆయన ఇచ్చిన డబ్బులే జనసేనకు ఇంధనంగా మారింది. 

రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు అవార్డు వస్తుందని అనుకున్నాను. గోదారి తీర ప్రాంతాల్లో జీవించకపోయినా.. అద్భుతంగా నటించాడు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు. సంకల్ప బలం, పట్టుదల, కార్యదక్షత ఉంటే.. అందరూ మెగాస్టార్ చిరంజీవిలా ఎదగొచ్చు. ఆయన అంతలా ఎదగబట్టే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను.  

మా అన్నయ్య చిరంజీవి షూటింగ్‌లు చేసి ఇంటికి అలిసిపోయి వచ్చేవారు. ఆ టైంలో ఖాళీగా ఉండే నేను.. ఆయన షూస్, సాక్సులు తీసి కాళ్లు తుడిచేవాడిని. ఈ హీరో సినిమా పోవాలని మా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు అని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందరూ బాగుండాలని మేం కోరుకుంటాం.  

రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చూస్తే నాకు అసూయగా అనిపిస్తుంది. నాకు హార్స్ రైడింగ్ రాదు. కానీ గబ్బర్ సింగ్ టైంలో హార్స్ రైడింగ్ పెట్టారు. నాకు హార్స్ రైడింగ్ రాదు అని గుర్రం దగ్గరకు వెళ్లి చెప్పా. దానికి క్యారెట్ పెట్టాను. అది నన్ను సురక్షితంగా తీసుకెళ్లింది. కానీ రామ్ చరణ్ మాత్రం హార్స్ రైడింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాను. నాకు చాలా నచ్చింది. సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది. 

ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరూ క్షేమంగా తిరిగి వెళ్లాలి. మీకు ఏమైనా అయితే నా గుండెకు గాయమైనట్టుగా ఉంటుంది. 

సినిమాను సినిమాలా చూడండి. టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రతీ టికెట్ మీద జీఎస్టీ ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాక్కూడా ఇష్టం ఉండదు. అన్ని ఇండస్ట్రీల వ్యక్తులు కలిసి సినిమాల్ని చేస్తున్నారు. 

హాలీవుడ్‌ని అనుకరించడం కాకుండా మన మూలాల్ని పైకి తెచ్చేలా కథల్ని తీసుకురావాలి. స్వర్గీయ ఎన్టీరామారావు ఎప్పుడూ కూడా ఎవ్వరి మీద వివక్షను చూపించలేదు. చంద్రబాబు గారు సైతం ఎప్పుడూ తెలుగు చిత్ర సీమ అభివృద్దికి దోహద పడుతూనే ఉన్నారు. 

శంకర్ గారు తీసిన ఒకే ఒక్కడు, శివాజీ వంటివి చూస్తుంటే ఓ తృప్తి కలుగుతుంది. సినిమాలో మంచి చెడులూ ఉంటాయి. ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే చిత్రాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. విలువల్ని నేర్పించే చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. 

ఆంధ్రప్రదేశ్ తరుపున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి, శంకర్ గారికి, దిల్ రాజు, శిరీష్ గార్లకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎస్ జే సూర్య గారు చాలా మంచి దర్శకులు. ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నారు. నటుడు కావాలనే కోరిక ఉందని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నటుడిగా ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. గేమ్ చేంజర్ టీంకు ఆల్ ది బెస్ట్. కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలై పోవాలి" అంటూ పవన్ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement
Pawan Kalyan
Game Changer
Pre Release Event
Ram Charan
Shankar
Dil Raju
Tollywood
Andhra Pradesh
Telangana

More Telugu News