చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటానని రేవంత్ రెడ్డి ఆరోజు చెప్పారు: బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటానని రేవంత్ రెడ్డి ఆరోజు చెప్పారు: బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి

Rakesh Reddy takes on Revanth Reddy over job calender
  • చంద్రబాబు ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారన్న బీఆర్ఎస్ నేత
  • రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్న
  • 2025 క్యాలెండర్ ప్రస్తుతానికి ఖాళీగా ఉందని ఎద్దేవా
ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తాను తన రాజకీయ గురువు చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారని, కానీ ముఖ్యమంత్రి ఆ విషయం మరిచినట్లున్నారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఏపీపీఎస్సీ ద్వారా జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేశారని, ఇక రేవంత్ రెడ్డి ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.

పక్క రాష్ట్రంలో తేదీలతో సహా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించారన్నారు. 2024 క్యాలెండర్ పూర్తయిందని... కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మాత్రం పూర్తి కాలేదన్నారు. 2024 క్యాలెండర్ ప్రకారం జనవరిలో సంక్రాంతి, ఫిబ్రవరిలో మహాశివరాత్రి, మార్చిలో హోలీ, ఏప్రిల్‌లో ఉగాది, జూలైలో మొహర్రం, ఆగస్ట్‌లో రాఖీ, సెప్టెంబర్‌లో వినాయక చవితి‌, అక్టోబర్‌లో దసరా, నవంబర్‌లో దీపావళి, డిసెంబర్‌లో క్రిస్మస్ వచ్చిందని ఎద్దేవా చేశారు.

కానీ, ఈ రాష్ట్రంలోని యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదన్నారు. పండుగలు, పబ్బాలు, పంచాంగాలతో గత ఏడాది క్యాలెండర్ నిండిపోయిందని... 2025 క్యాలెండర్ మాత్రం ప్రస్తుతానికి ఖాళీగా ఉందన్నారు. అంటే ఈ ఏడాది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, టీజీపీఎస్సీ కలిసి జాబ్ క్యాలెండర్ అని పండుగలు, పబ్బాలే ఇస్తారేమోనని చురక అంటించారు. అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ పండుగ చేసుకుంటోందని, కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఎండ్‌గా మారిందన్నారు.

అధికారంలోకి వచ్చాక 50 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు రేవంత్ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోందని, కానీ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మంది పెళ్లిళ్లకు మంగళహారతి పట్టడంలో రేవంత్ రెడ్డి ముందుంటారన్నారు.

కనీసం 2025లోనైనా జాబ్ క్యాలెండర్‌లో పండుగలతో పాటు కొన్ని ఉద్యోగాలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త క్యాలెండర్ రాగానే యూపీఎస్సీ తన జాబ్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిందన్నారు. యూపీఎస్సీ, తమిళనాడు, బీహార్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇచ్చే జాబ్ క్యాలెండర్‌లో తేదీలతో సహా ఉంటాయన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్‌... జాబ్ లెస్ క్యాలెండర్‌గా ఉందని ఎద్దేవా చేశారు. 
Advertisement
Rakesh Reddy
Telangana
Revanth Reddy
Chandrababu

More Telugu News