Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెర్త్ టెస్టులో భార‌త్ ఘ‌న విజ‌యం

India Won by 295 Runs in Perth Test
Advertisement
  • పెర్త్ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ తొలి టెస్టు
  • 295 ప‌రుగుల తేడాతో టీమిండియా గెలుపు
  • 534 ప‌రుగుల భారీ లక్ష్యఛేద‌న‌లో 238 ర‌న్స్‌కే ఆసీస్ ఆలౌట్‌
  • అర్ధ శ‌త‌కం (89)తో ట్రావిస్ హెడ్ ఒంటరి పోరాటం
  • జ‌స్ప్రీత్ బుమ్రాకు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
Advertisement
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రిగిన‌ తొలి టెస్టులో భార‌త జ‌ట్టు ఘ‌న‌ విజ‌యం సాధించింది. 534 ప‌రుగుల భారీ లక్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా 238 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డంతో టీమిండియా 295 ర‌న్స్ తేడాతో గెలిచింది. 

ఓవ‌ర్‌నైట్ స్కోర్ 12/3తో నాలుగో రోజు ఆట కొన‌సాగించిన ఆసీస్ మ‌రో ఐదు ప‌రుగులు జోడించి ఉస్మాన్ ఖ‌వాజా వికెట్‌ను కోల్పోయింది. ఆ త‌ర్వాత స్టీవ్ స్మిత్‌, ట్రావిస్ హెడ్ ద్వ‌యం కొద్దిసేపు భారత బౌల‌ర్ల‌ను నిలువరించింది. 

ఐదో వికెట్‌కు ఈ జోడి 62 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని అందించింది. అయితే, మ‌హ్మ‌ద్‌ సిరాజ్ ఓ అద్భుత‌మైన బంతితో స్మిత్‌ను బోల్తా కొట్టించాడు. ఈ క్ర‌మంలోనే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఆ త‌ర్వాత‌ మిచెల్ మార్ష్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రిగెత్తించాడు. 

89 ప‌రుగులు చేసి సెంచ‌రీ వైపు దూసుకెళ్తున్న హెడ్‌ను బుమ్రా పెవిలియ‌న్‌కు పంపాడు. దీంతో మార్ష్‌, హెడ్ నెల‌కొల్పిన 82 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. అనంత‌రం స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే మిచెల్ మార్ష్ (47), మిచెల్ స్టార్క్ (12) వికెట్లను కోల్పోవ‌డంతో ఆసీస్ ఓట‌మి ఖాయ‌మైంది. చివ‌రికి ఆతిథ్య జ‌ట్టు 58.4 ఓవ‌ర్ల‌లో 238 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 

భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. అలాగే వాషింగ్ట‌న్ సుంద‌ర్ 2, హ‌ర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి 8 వికెట్లతో (మొద‌టి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 3) రాణించిన కెప్టెన్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.  

కాగా, ఈ విజ‌యంతో ఐదు మ్యాచుల బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భార‌త్ 0-1తో లీడ్‌లోకి దూసుకెళ్లింది. ఇక రెండో టెస్టు వ‌చ్చే నెల 6 నుంచి 10వ తేదీ మ‌ధ్య అడిలైడ్‌లో జ‌ర‌గ‌నుంది.      

భార‌త్ తొలి ఇన్నింగ్స్‌: 150, రెండో ఇన్నింగ్స్‌: 487/6 డిక్లేర్‌
ఆసీస్  తొలి ఇన్నింగ్స్‌: 104, రెండో ఇన్నింగ్స్‌: 238



Advertisement
Advertisement
Australia vs India
Team India
Cricket
Perth Test
Sports News

More Telugu News