Tamil Nadu: భార్య అతి భక్తిని తట్టుకోలేక పెట్రోలు పోసిన భర్త.. చావుబతుకుల మధ్య జంట

Angry with wife for her religious fervour man sets her on fire in Tamil Nadu
  • తమిళనాడులోని తిరువెరుమూర్‌లో ఘటన
  • నిత్యం పూజల్లోనే గడుపుతూ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని భర్త ఆగ్రహం
  • రాత్రి 11 గంటల సమయంలో పూజలు చేయడంతో వాగ్వివాదం
  • భార్యపై పెట్రోలు పోసిన భర్త
  • పక్కనే ఉన్న దీపం అంటుకోవడంతో చెలరేగిన మంటలు
  • అగ్నికీలల్లో చిక్కుకున్న భార్యాభర్తలు
  • వారిని రక్షించే క్రమంలో ఇద్దరు కుమారులకూ గాయాలు
ఓ మహిళ అతి భక్తి ప్రాణం మీదకు వచ్చింది. నిత్యం పూజల్లో గడుపుతూ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదన్న కోపంతో ఆమెపై పెట్రోలు పోశాడో భర్త. ఈ క్రమంలో పక్కనే ఉన్న దీపాలు అంటుకోవడంతో ఇద్దరూ మంటల్లో చిక్కుకుని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తమిళనాడులోని తిరువెరుమూర్‌లో జరిగిందీ ఘటన.

రాజేంద్రప్రసాద్ (56), హేమబిందు (50) భార్యాభర్తలు. దైవంపై ఎనలేని విశ్వాసం పెంచుకున్న బిందు నిత్యం పూజల్లోనే గడిపేది. దీంతో పూజల్లో పడి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదంటూ ప్రసాద్‌తో ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బిందు ప్రార్థనలు ప్రారంభించింది. ఈ సమయంలో పూజలు ఏంటంటూ ప్రసాద్ ఆమెపై కోప్పడ్డాడు. ఇది ఇద్దరి మధ్య వాగ్వివాదానికి కారణమైంది. అది మరింత పెరగడంతో కోపం పట్టలేని ప్రసాద్ బైక్‌ కోసం సీసాలో తెచ్చిపెట్టుకున్న పెట్రోలును ఆమెపై పోశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న పూజా దీపం ఆమెకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ప్రసాద్, బిందు ఇద్దరూ మంటల్లో చిక్కుకుపోయారు. 

వెంటనే అప్రమత్తమైన కుమారులు గుణశేఖర్, గురుస్వామి వారిని రక్షించే క్రమంలో వారు కూడా గాయపడ్డారు. నలుగురు ప్రస్తుతం తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రసాద్, బిందుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Tamil Nadu
Crime News
Religius Fervour

More Telugu News