Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో డీజీపీ భేటీ

ap dgp dwaraka tirumala rao met deputy cm pawan kalyan
  • ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి పవన్ కల్యాణ్‌తో సమావేశమైన డీజీపీ 
  • కీలక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం
  • రాష్ట్రంలో పలువురు పోలీసుల అధికారుల తీరుపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి 
రాష్ట్రంలో పోలీసు శాఖ తీరుపై ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్నే రేపాయి. పవన్ వ్యాఖ్యలపై నాడు హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియా సమావేశాల్లో వివరణ కూడా ఇచ్చారు. అయితే శనివారం స్వయంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వెళ్లి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

పలు కీలక విషయాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి ఘటనలు, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేయడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, సోషల్ మీడియాలో పోస్టులు, అరెస్టులపై పవన్ తో డీజీపీ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వీరి భేటీకి సంబంధించి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి కానీ, అటు డీజీపీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. 
Pawan Kalyan
AP DGP
Dwaraka Tirumala Rao
AP Police

More Telugu News