మేఘా కృష్ణారెడ్డి ఇంటిపైకి ఏసీబీని పంపే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: కేటీఆర్ సవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేఘా కృష్ణారెడ్డి ఇంటిపైకి ఏసీబీని పంపే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: కేటీఆర్ సవాల్

KTR challenges Revanth Reddy on Megha Krishna Reddy
  • మేఘాను బ్లాక్ లిస్ట్‌లో పెట్టే దమ్ముందా? అని ప్రశ్న
  • తెలంగాణకు లక్షల కోట్లు తెచ్చినందుకు నాపై కేసు పెడతారా? అని నిలదీత
  • జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధమవుతానని వ్యాఖ్య
మేఘా కృష్ణారెడ్డి ఇంటి పైకి ఏసీబీని పంపే దమ్ము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా? సుంకిశాల ఘటనలో అవినీతి కేసు పెట్టాల్సి వస్తే కృష్ణారెడ్డి పైనే పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సుంకిశాల ఘటన ద్వారా రూ.80 కోట్లు నష్టం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారని... మేఘాను బ్లాక్ లిస్టులో పెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ చేశారు.

తెలంగాణకు లక్షల కోట్లు తెచ్చినందుకు నాపై కేసు పెడతారా? నేను జైలుకెళ్లేందుకైనా సిద్ధమే.. జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధమవుతానన్నారు. ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో ఒప్పందానికి ముందే డబ్బులు చెల్లించడం, నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.

బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తనపై ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. రాజ్ భవన్ కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నాయని ఆరోపించారు. ఆ పార్టీలు రెండు ఒక్కటై తమ పార్టీని ఖతం చేయాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను విచారించేందుకు అనుమతివ్వడం గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు.

తన మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమే అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరాల సరసన చేర్చాలనే ఉద్దేశంతో ఫార్ములా ఈ-కారు రేసింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫార్ములా-1 రేసింగ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు నిర్వాహకులు మొగ్గు చూపలేదని, అందుకే ఫార్ములా ఈ-రేసింగ్ వైపు మొగ్గు చూపామన్నారు. మన దేశంలో ఫార్ములా-1 రేసింగ్ నిర్వహణకు చంద్రబాబు 2003లో ప్రయత్నించారని, కానీ నిర్వాహకులు ఆసక్తి చూపలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తాను వారితో మరోసారి మాట్లాడానని... అయినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని తెలిపారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలతో నిర్వహించే ఫార్ములా ఈ-కారు రేసింగ్ నిర్వహించామని తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో ఢిల్లీలో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు జరిగాయని కేటీఆర్ గుర్తు చేశారు. వాటి కోసం రూ.70 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారన్నారు. అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ఖర్చు సహజమే అన్నారు. కామన్వెల్త్ క్రీడల కోసం అయితే అసలు ఖర్చు కంటే కాంగ్రెస్ 100 రెట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఆ లెక్కన చూస్తే ప్రస్తుత నిర్వహణ ఖర్చు పది... పదిహేను రెట్లు పెరుగుతుందన్నారు. తాము ఓ మంచి విద్దేశంతో నిర్వహిస్తే కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. అసలు ఈ రేసును రద్దు చేసినందుకు రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖలపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు తాము బ్రాండ్ ఇమేజ్ తీసుకువస్తే రేవంత్ రెడ్డి బ్యాడ్ ఇమేజ్ తెస్తున్నారన్నారు.
Advertisement
KTR
Revanth Reddy
Congress
BRS

More Telugu News