ఇండోనేషియాలో ఐఫోన్16పై నిషేధం...!
- యాపిల్ సంస్థకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ఇండోనేషియా సర్కార్
- పెట్టుబడులపై ఇచ్చిన హామీని విస్మరించడం వల్లే ఆ నిర్ణయం అంటూ మీడియాలో కథనాలు
- 40 శాతం స్థానికంగా తయారు చేయాలన్న నిబంధనను ఉల్లంఘించడం వల్లే ఈ పరిస్థితి అంటున్న పరిశ్రమల శాఖ
ఇతర దేశాల్లో కొనుగోలు చేసినా తమ దేశంలో వాడడంపైనా నిషేధం విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ పరిశ్రమల శాఖ మంత్రి గమివాంగ్ కర్తసస్మిత వెల్లడించారు. ఇండోనేషియాలో యాపిల్ ఐఫోన్ 16 వాడటానికి ఐఎంఈఐ సర్టిఫికేషన్ లేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా వాడితే అది అక్రమమే అవుతుందని చెప్పారు. ఇంతకూ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే.. పెట్టుబడికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రభుత్వం యాపిల్‌పై ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వినబడుతున్నాయి.
యాపిల్ సంస్థ 1.71 మిలియన్ రూపాయలు (ఇండోనేషియా కరెన్సీ) పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. అయితే 1.48 మిలియన్ రూపాయలు మాత్రమే పెట్టుబడిగా పెట్టిందని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. యాపిల్ సంస్థ తమ హామీని అమలు చేయకపోవడం వల్లనే ఐఫోన్ 16పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ శాఖ మంత్రి వెల్లడించారు. ఇండోనేషియాలో విక్రయించాలంటే 40 శాతం స్థానికంగా తయారు చేయాలన్న నిబంధన ఉందని, దాన్ని అందుకోవడంలో యాపిల్ విఫలం చెందడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు.