ఇక ఏపీలోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు... మంత్రి నారాయణ వివరణ!
- ఏపీలో అక్రమ నిర్మాణాలపై స్పందించిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
- ఏపీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి నారాయణ
- ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్చందంగా ఖాళీ చేయాలని సూచన
ఈ క్రమంలో ఏపీలో ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక కామెంట్స్ చేశారు. మంగళవారం మచిలీపట్నం పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ బుడమేరు ఆక్రమణల వల్లే ఇటీవల విజయవాడకు భారీ వరద వచ్చిందని అన్నారు. ఆపరేషన్ బుడమేరు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్చందంగా ఖాళీ చేయాలని సూచించారు.
అక్రమ నిర్మాణాల్లో ఏ రాజకీయ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఊపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తెలిపారు. పేదవారిని ఇబ్బంది పెట్టకుండా టిడ్కో ఇళ్లు వంటి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ నిర్మాణాల్లో ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించి వారిని సంతోషపెట్టిన తర్వాతే ముందుకు వెళతామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు తావు లేకుండా అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపడతామని ఆయన వెల్లడించారు.