మిథున్ చ‌క్ర‌వ‌ర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Mithun Chakraborty to be honoured with Dadasaheb Phalke Award
షార్ట్స్‌లో చూడండి
భార‌తీయ సినిమాకు సంబంధించి అత్యున్న‌త పుర‌స్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈసారి ప్ర‌ముఖ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తిని వ‌రించింది. ఈ ఏడాది ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుకు ఆయ‌న ఎంపికైన‌ట్టు కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ తాజాగా ప్ర‌క‌టించింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయ‌న‌ను ఈ అవార్డుతో సత్కరించ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొంది.  

ఈ మేర‌కు మంత్రి అశ్విని వైష్ణవ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా ఈ వార్త‌ను పంచుకున్నారు. "మిథున్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. భారతీయ సినిమాకు ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే ఎంపిక జ్యూరీ ఈ దిగ్గజ నటుడిని ఎంపిక చేసింద‌ని ప్రకటించడం గౌరవంగా ఉంది" అని ట్వీట్ చేశారు.

ఇక ఈ ఏడాది మిథున్‌ను ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు కూడా వ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ సీనియ‌ర్ నటుడు 1976లో మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన 'మృగయా'తో తెరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి గాను ఆయ‌న‌ ఉత్తమ నటుడిగా తన మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును సైతం గెలుచుకున్నారు.

1980వ దశకంలో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. 1979లో వ‌చ్చిన‌ స్పై థ్రిల్లర్ 'సురక్షా' చిత్రం ద్వారా ఆయ‌న‌ స్టార్‌డమ్ బాగా పెరిగింది. ఆ తర్వాత 'డిస్కో డాన్సర్', 'డ్యాన్స్ డ్యాన్స్', 'ప్యార్ ఝుక్తా నహీ', 'కసమ్ పైదా కర్నే వాలేకి', 'కమాండో' వంటి సూప‌ర్‌ హిట్స్ కొట్టారు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి.
Go Back to Shorts
Mithun Chakraborty
Dadasaheb Phalke Award
Bollywood

More Telugu News