కలెక్టరేట్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకున్న పోలీస్
- శనివారం తెల్లవారుజామున రంగారెడ్డి కలెక్టరేట్ లో ఘటన
- ఆత్మహత్య లేఖ రాసిపెట్టి దారుణం
- దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు
రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి డ్యూటీకి వచ్చాడు. ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారుజామున తన తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని లేఖ రాసిపెట్టి బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
కానిస్టేబుల్ తండ్రి దూసరి సత్తయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కాగా, కానిస్టేబుల్ బాలకృష్ణ సూసైడ్ నోట్ రాసింది నిజమేనని ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు. ఆ నోట్ లో ఎవరిపైనా ఆరోపణలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. బాత్రూమ్ కి వెళ్లి తన తుపాకీతో తనే కాల్చుకుని చనిపోయాడని, ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిందని ఏసీపీ తెలిపారు.