మీరు చేయాల్సిన పని ఇదే...: బంగ్లాదేశ్ ఆర్మీకి ప్రధాని హసీనా తనయుడి సూచన

Sheikh Hasina Son To Bangladesh Army Amid Clashes
  • ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ 
  • త‌న ప‌దవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిపోయిన ప్ర‌ధాని షేక్‌ హ‌సీనా
  • ప్ర‌ధాని త‌న‌యుడు సజీబ్ వాజెద్ జాయ్ ఫేస్‌బుక్‌లో కీల‌క‌ పోస్ట్
పొరుగు దేశం బంగ్లాదేశ్ నిర‌స‌న‌కారుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతున్న విష‌యం తెలిసిందే. ఏకంగా దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. దాంతో సైనిక పాలన విధించారు. సైనిక పాలనపై ఆర్మీ చీఫ్ ప్రకటన చేయకముందు, ప్ర‌ధాని హ‌సీనా త‌న‌యుడు సజీబ్ వాజెద్ జాయ్ దేశ ఆర్మీని ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన‌ ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  

ఆమె పాలనను వేరే వాళ్లు (ఇతర పార్టీలు) స్వాధీనం చేసుకోకుండా నిరోధించాలని దేశ భద్రతా దళాలను ఆయ‌న‌ కోరారు. "మీ కర్తవ్యం దేశ‌ ప్రజలను, మ‌న దేశాన్ని సురక్షితంగా ఉంచడం. రాజ్యాంగాన్ని కాపాడ‌డం" అని అమెరికాలో ఉండే సజీబ్ వాజెద్ జాయ్ త‌న‌ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

"ఎన్నికల్లో గెలవని పార్టీలను ఒక్క నిమిషం కూడా అధికారంలోకి రానివ్వవద్దు, అది మీ కర్తవ్యం" అని అన్నారు. హసీనాకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సలహాదారుగా ఉన్న జాయ్.. ఆమెను బలవంతంగా బయటకు పంపితే బంగ్లాదేశ్ సాధించిన పురోగతికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. దేశ అభివృద్ధి, పురోగతి అంతా మాయమైపోతుందన్నారు. తిరిగి అక్క‌డికి చేరుకోలేమ‌న్నారు. "ఇలాంటి పరిస్థితులను నేను కోరుకోవడంలేదు. మీరు కూడా కోరుకోరని నాకు తెలుసు" అంటూ సజీబ్ వాజెద్ జాయ్ పేర్కొన్నారు.

కాగా, 2007 జనవరిలోనూ దేశంలో రాజకీయ అశాంతి నేప‌థ్యంలో బంగ్లాదేశ్ సైన్యం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.  రెండేళ్లపాటు తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది.
Go Back to Shorts
Sheikh Hasina
Bangladesh protests
Bangladesh Army

More Telugu News