ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం.. రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Revanth Reddy Govt Decided To Build New Building To Osmania Hospital
  • గోషామహల్ పోలీస్ క్వార్టర్స్‌లో 30 ఎకరాల స్థలంలో నిర్మాణం
  • ప్రస్తుతం ఉన్న భవనాన్ని హెరిటేజ్ భవనంగా మార్చాలని నిర్ణయం
  • శాసనసభలో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి భవనంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించి, ప్రస్తుత భవనాన్ని వారసత్వ భవనం (హెరిటేజ్ బిల్డింగ్)గా మారుస్తామని ప్రకటించింది. ఈ మేరకు నిన్న శాసనసభలో ప్రకటించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. నిజానికి ప్రస్తుతం ఆసుపత్రి కొనసాగుతున్న భవనాన్ని కూల్చివేసి ఆ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని భావించారు. అయితే, ఇది కాస్తా కోర్టుకు చేరడంతో దానిని అలానే ఉంచి గోషామహల్ పోలీస్ క్వార్టర్స్‌లోని 30 ఎకరాల స్థలంలో ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించింది.

2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా 26 ఎకరాల స్థలంలో ఉన్న ఆసుపత్రిని కూల్చివేసి దాని స్థానంలో కొత్తది నిర్మిస్తామని ప్రకటించారు. వారసత్వ భవనాల కూల్చివేత సరికాదంటూ చరిత్రకారులు కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించింది. కాగా, ప్రస్తుతం ఉన్న భవనాన్ని 1919లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు.
Go Back to Shorts
Osmania Hospital
Hyderabad
Revanth Reddy
Congress

More Telugu News