రోజుకు 14 గంటల పని అంటున్న బెంగళూరు ఐటీ కంపెనీలు... తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులు!

Bengaluru IT firms proposes 14 hours work system
దేశంలో ఐటీ రంగం బాగా వేళ్లూనుకున్న నగరాల్లో బెంగళూరు ఒకటి. అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థలన్నీ బెంగళూరులోనూ తమ కేంద్రాలు తెరిచి, కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే, తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. 

రోజులో పనివేళలు 14 గంటలు ఉండాలని బెంగళూరు ఐటీ పరిశ్రమ కోరుతోంది. ఇప్పుడున్న పనిగంటలను 14 గంటలకు పెంచాలని బెంగళూరులోని ఐటీ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. 

12 గంటలు సాధారణ పని, మరో రెండు గంటలు అదనపు పని కలిపి మొత్తం 14 గంటల పని అనేది ఈ ఐటీ కంపెనీల ఆలోచన. ప్రస్తుతం 10 గంటల సాధారణ పని, రెండు గంటల అదనపు పని కలిపి మొత్తం 12 గంటల పని విధానానికి కార్మిక చట్టాలు అనుమతిస్తున్నాయి. దీన్ని 14 గంటలకు పెంచాలని ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. 

ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దుకాణాలు, వ్యాపార సముదాయాల చట్టం-1961ను సవరించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

వాస్తవానికి ఈ 14 గంటల ప్రతిపాదన కొత్తదేమీ కాదు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలోనే దీని గురించి ప్రస్తావన తెచ్చారు. యంగ్ ప్రొఫెషనల్స్ వారానికి 70 గంటలు పనిచేయాలని నారాయణమూర్తి పేర్కొనగా, అది తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు బెంగళూరు ఐటీ పరిశ్రమ ప్రతిపాదన పట్ల కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

కర్ణాటక రాష్ట్ర ఐటీ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) ఈ ప్రతిపాదన పట్ల అభ్యంతరం చెబుతోంది. పని గంటలు పొడిగించడం వల్ల ఐటీ కంపెనీలు మూడు షిఫ్టుల విధానం నుంచి రెండు షిఫ్టుల విధానానికి మారతాయని, ఉద్యోగుల్లో మూడింట ఒక వంతు మంది తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని కేఐటీయూ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాకుండా, 14 గంటల సుదీర్ఘ సమయం పాటు పనిచేయడం వల్ల ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలు 14 గంటల పని ప్రతిపాదన చేయడం ద్వారా, ఉద్యోగులను మనుషుల్లా కాకుండా యంత్రాల్లా చూస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదన పట్ల జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Bengaluru IT Firms
14 Hours Work
IT Employees
KITU
Congress
Karnataka

More Telugu News