Needles in Head: యువతి తలలోకి 70 సూదులు దింపిన మాంత్రికుడు

70 needles inserted into odisha womans head in the name of treatment
షార్ట్స్‌లో చూడండి
అనారోగ్యంతో ఉన్న యువతి తలలో చికిత్స పేరిట 70 సూదులు దింపిన మాంత్రికుడి ఉదంతం ప్రస్తుతం ఒడిశాలో కలకలం రేపుతోంది. సూదులు పుర్రెను దాటి మెదడు దాకా వెళ్లకపోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. బొలంగీర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక సింథికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్‌గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహారా (19) మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో, ఆమె తండ్రి బిష్ణు బెహారా.. తేజ్‌రాజ్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించారు. 

వైద్యం పేరిట తేజ్‌రాజ్ పలు దఫాలుగా రేష్మా తలలోకి 70 సూదులను గుచ్చాడు. ఇటీవల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు వింసార్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం వైద్యులు ఆమెకు సిటీ స్కానింగ్ చేసి నిర్ఘాంతపోయారు. ఆమె పుర్రెపై సూదులు ఉన్నట్టు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేశారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి యువతి తలలోని 70 సూదులను బయటకు తీశారు. పుర్రె ఎముకపై ఉన్న సూదులు లోపలికి వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడిందని వింసార్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రబినారాయణ్ గురు తెలిపారు. పోలీసులు మాంత్రికుడు తేజ్‌రాజ్‌ను అరెస్టు చేశారు. 


Go Back to Shorts
Needles in Head
Odisha
Crime News

More Telugu News