హైకోర్టులో కేసీఆర్‌కు భారీ షాక్.. రిట్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం.. నర్సింహారెడ్డి కమిషన్‌కు గ్రీన్ సిగ్నల్
- విద్యుత్తు కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలు అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపణ
- విచారణకు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటు
- కమిషన్ ఏర్పాటును తప్పుబడుతూ హైకోర్టులో కేసీఆర్ రిట్
- కమిషన్ తన పని కొనసాగించవచ్చని న్యాయస్థానం స్పష్టీకరణ
విచారణ చేపట్టిన కమిషన్ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌ను ఆదేశించింది. అయితే, ఆ సమయంలో తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, మరోమారు వస్తానని కమిషన్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత విచారణకు హాజరు కాకపోగా, విచారణ కమిషన్ తీరును తప్పుబడుతూ బహిరంగ లేఖ రాశారు. ఆ తర్వాత అసలు కమిషన్ ఏర్పాటే చెల్లుబాటు కాదని, దానిని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ దురుద్దేశపూర్వకంగా, ఏకపక్షంగా విచారిస్తోందని, విచారణ పూర్తికాకుండానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని చెప్పిందని ఆరోపించారు.
కేసీఆర్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల అనంతరం తీర్పును రిజ్వర్వ్ చేసిన ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనతో విభేదించిన న్యాయస్థానం కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తన విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.