ఏపీలోని పింఛన్ దారులకు సీఎం చంద్రబాబు లేఖ
- పింఛన్ అందుకోవడానికి మీరు పడ్డ అగచాట్లు చూసి చలించిపోయానన్న బాబు
- ఏ ఆకాంక్షలతో మీరు ఓటేసి గెలిపించారో వాటిని నెరవేర్ఛడమే మా తక్షణ కర్తవ్యమని వెల్లడి
- మాటిచ్చినట్లే పెంచిన పింఛన్ మీ ఇంటివద్దనే అందిస్తామన్న సీఎం
మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ.1000 పెంచి రూ.4000 ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.3000 పెంచి ఇక నుంచి రూ.6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మూడు నెలలకు పెంచిన రూ.3000, జులై నెల పింఛన్ రూ.4000 కలిపి మొత్తం రూ.7000 మీ ఇంటికి తెచ్చి ఇస్తామని అన్నారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టినట్లు వివరించారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడబోమని చెప్పారు. పింఛన్ల పెంపుతో ప్రభుత్వంపై నెలనెలా అదనంగా రూ.819 కోట్ల భారం పడుతుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తెచ్చినట్లు వివరించారు.
'పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తాయని ఆశిస్తున్నాము. ప్రజా భద్రత మా బాధ్యత. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నా'నని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.