T20 World Cup 2024: ఇంగ్లండ్‌పై ‘స్పిన్ పంజా’ విసిరి.. టీ20 వరల్ కప్ ఫైనల్ చేరిన భారత్

India beat England and enter the final of the ICC T20 World Cup 2024
  • 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా
  • 172 పరుగుల లక్ష్య ఛేదనలో 103 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
  • అదరగొట్టిన భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.. చెరో మూడు వికెట్లతో రాణింపు
  • బ్యాటింగ్‌లో సత్తా చాటిన కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్
  • 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
మరోసారి ఐసీసీ టైటిల్‌ను ముద్దాడేందుకు భారత్ కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 2022 టోర్నీలో సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ నాడు ఓడించిన ఇంగ్లండ్‌పై గెలిచి టీమిండియా గ్రాండ్‌గా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో అడుగుపెట్టింది. దీంతో 10 ఏళ్ల తర్వాత భారత్ టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరినట్టయింది.

తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లండ్ చతికిలపడింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ సత్తా చాటడంతో 16.4 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 68 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (57), సూర్య కుమార్ యాదవ్ (47) సత్తా చాటి భారత విజయానికి దోహదపడ్డారు. ఇక అత్యంత కీలకమైన వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

తేలిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్లు
172 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇంగ్లండ్ ఆరంభం పర్వాలేదనిపించిన అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలానికి ఆ జట్టు లైనప్ కుదేలైంది.  26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆ జట్టు ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 103 పరుగులకే ఆలౌట్ అయింది. 25 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో జాస్ బట్లర్ 23, ఫిలిప్ సాల్ట్ 5, మొయిన్ అలీ 8, జానీ బెయిర్‌స్టో 0, సామ్ కరాన్ 2, లివింగ్‌స్టోన్ 11, క్రిస్ జోర్డాన్ 1, జోఫ్రా ఆర్చర్ 21, అదిల్ రషీద్ 2, రీస్ టాప్లీ 3(నాటౌట్) చొప్పున వికెట్లు తీశారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీశారు. ఇక స్టార్ పేసర్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. మరో రెండు వికెట్లు రనౌట్ రూపంలో వచ్చాయి.

మరోసారి ఆదుకున్న కెప్టెన్ రోహిత్
ఇక భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ఆదుకున్నాడు. ఆరంభంలోనే విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వికెట్లను కోల్పోయినప్పటికీ జాగ్రత్తగా 57 పరుగులు బాదాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మిగతా బ్యాటర్లలో సూర్య కుమార్ యాదవ్ 47, హార్ధిక్ పాండ్యా 23, విరాట్ కోహ్లీ 9, పంత్ 4, రవీంద్ర జడేజా 17(నాటౌట్), శివమ్ దూబే 0, అక్షర్ 10, అర్షదీప్ సింగ్ 1 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 171 పరుగులు నమోదు చేసింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. టాప్లీ, ఆర్చర్, సామ్ కరాన్, అదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.

ఓటమి ఎరుగని జట్ల మధ్య ఫైనల్
కాగా జూన్ 29న బ్రిడ్జ్‌టౌన్‌లో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. కాగా ఈ రెండు జట్లు టోర్నీలో ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు. దక్షిణాఫ్రికా వరసగా 8 మ్యాచ్‌లు గెలవగా.. భారత్ 7 విజయాలు సాధించింది. టీమిండియా ఆడాల్సిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.
T20 World Cup 2024
India vs England
World cup semi Final
Cricket
Team India
India vs South Africa
World cup final

More Telugu News