లోక్‌సభ ఎన్నికలు, పార్లమెంట్ నిర్వహణపై తొలిసారి స్పందించిన ఆర్ఎస్ఎస్ చీఫ్
- ఎన్నికలు పోటీ మాత్రమే.. యుద్ధం కాదన్న మోహన్ భగవత్
- ఏకాభిప్రాయం కోసమే ఎన్నికల ప్రక్రియ అని వ్యాఖ్య
- పార్లమెంటులో ప్రతి అంశంపై రెండు కోణాల్లో చర్చ జరగాలని అధికార, విపక్షాలకు సూచన
ప్రతి ఐదేళ్లకోసారి ప్రజాతీర్పు వస్తుందని, అయితే ఈ ప్రజా నిర్ణయం ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? అనే అంశాలు ఆర్ఎస్ఎస్‌కు సంబంధించినవి కావని భగవత్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి ఎన్నికలలో ప్రజాభిప్రాయాన్ని మెరుగైన రీతిలో అర్థం చేసుకోవడానికి సంఘ్ పని చేస్తుంది. ఈసారి కూడా అదే పని చేసింది. ఎన్నికల ఫలితాల విశ్లేషణలోనే ఆగిపోలేదు. నేతలను ఎందుకు ఎన్నుకుంటారు? వివిధ అంశాలపై ఏకాభిప్రాయంతో పార్లమెంట్‌కు వెళ్లడానికి ఎన్నుకుంటారు. ఏకాభిప్రాయం మన సంప్రదాయం. ఆ దిశగా పురోగతి కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ యుద్ధం కాదు.. పోటీ మాత్రమే’’ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
కాగా లోక్‌సభ ఎన్నికల్లో రెండు పక్షాలుగా విడిపోయి ప్రచారం నిర్వహించిన తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికలు, పరిపాలనలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.