ఇంట్లో వండి వడ్డించిన వంటకాలే ఎగ్జిట్ పోల్స్: దీదీ
- బెంగాల్ ఫలితాల అంచనాలపై మమతా బెనర్జీ రియాక్షన్
- గత ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదని వ్యాఖ్య
- దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని జోస్యం
- మెజారిటీ సీట్లు బీజేపీ గెల్చుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా
బెంగాల్ లో బీజేపీ హవా కొనసాగిందని, రాష్ట్రంలో మెజారిటీ సీట్లను కాషాయ పార్టీ కైవసం చేసుకుంటుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వెనకకు నెట్టి బీజేపీ ముందంజలో ఉంటుందని తెలిపాయి. ఈ అంచనాలపై ఏమనుకుంటున్నారని మమతా బెనర్జీని అడగగా.. గ్రౌండ్ రియాలిటీకి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భారీ వ్యత్యాసం ఉంటుందని చెప్పారు. 2016, 2019, 2021 లలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఇదే విషయం స్పష్టమైందని వివరించారు.
ఆ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారైన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈసారి కూడా బెంగాల్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతాయని వివరించారు. బెంగాల్ లో మాత్రమే కాదు తమిళనాడులో స్టాలిన్, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే, ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ యాదవ్, బీహార్ లో తేజస్వీ యాదవ్ మ్యాజిక్ చేస్తారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని వివరించారు. అయితే, బెంగాల్ లో టీఎంసీకి వ్యతిరేకంగా, బీజేపీకి మేలు చేకూర్చేందుకు సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పనిచేశాయని మమతా బెనర్జీ ఆరోపించారు.