కవితను తప్పించేందుకే బీఎల్ సంతోష్‌పై కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- తానూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శ
- కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా? అని ప్రశ్న
- రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకూడదంటే ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని సలహా
ఎన్నికలకు ముందు కేసీఆర్ అవినీతిపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఫోన్ ట్యాపింగ్ సహా ఏ కేసుల్లోనూ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా? అని ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన హయాంలో నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారని విమర్శించారు.
ఉపఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేసేందుకు, ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు. టెలికం రెగ్యులేటరీ చట్టానికి భిన్నంగా, కేంద్రం అనుమతి లేకుండా గత ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ సహా వివిధ అక్రమ కేసుల్లో దోషులకు శిక్ష పడేవరకు బీజేపీ రాజకీయ, న్యాయ పోరాటం చేస్తుందన్నారు.
తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం, ధరణి అవినీతిపై కూడా కాంగ్రెస్ ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా రూ.500 బోనస్, రుణమాఫీ అమలు చేయడం లేదన్నారు. తెలంగాణలో మెజార్టీ లోక్ సభ స్థానాలు బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.