జేసీ దివాకర్ రెడ్డి సంతకం ఫోర్జరీ.. సాహితి నిర్మాణ సంస్థపై కేసు

JC Diwakar Reddy Filed Case On Sahiti Movie Makers
హైదరాబాద్ కు చెందిన సాహితి నిర్మాణ సంస్థపై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లో తన నివాసం లీజు విషయంలో ఒప్పంద పత్రాలను తారుమారు చేశారని, తన సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సాహితి నిర్మాణ సంస్థ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం..జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 62లో ఉన్న తన ఇంటిని జేసీ దివాకర్ రెడ్డి గతంలో సాహితి నిర్మాణ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఈమేరకు 2020లో సాహితీ నిర్మాణ సంస్థ నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణతో మూడేళ్ల కాల పరిమితితో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

2023 మే నెలతో ఒప్పంద గడువు ముగియడంతో ఇల్లు ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా లక్ష్మీనారాయణ స్పందించలేదు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తమకు లీజు గడువు ఇంకా ఉందంటూ లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సాత్విక్‌ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు జేసీకి సమన్లు పంపింది. సాహితి నిర్మాణ సంస్థ యాజమాన్యం కోర్టులో దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన జేసీ.. వాటిలో ఒప్పందం తేదీ 2021 మే నెలగా మార్చినట్లు గుర్తించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ పత్రాలను తయారుచేసినట్లు ఆరోపించారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
JC Diwakar Reddy
TDP
Jubilee Hills
Forgery Case
Sahiti movie makers
House lease

More Telugu News