మరో వారం రోజులు బెయిల్ పొడిగించండి.. సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ విజ్ఞప్తి
- సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం
- అనారోగ్య సమస్యల నేపథ్యంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థన
- బెయిల్ ఇవ్వడంపైనే బీజేపీ ఆరోపణలు
లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓ పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం నిర్వహించుకోవడానికి సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. అయితే, బెయిల్ మంజూరు విషయంలో కేజ్రీవాల్ ను స్పెషల్ గా ట్రీట్ చేసిందంటూ బీజేపీ వర్గాలు సుప్రీంకోర్టు తీర్పును ఆక్షేపించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. కేజ్రీవాల్ విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లుందని పరోక్షంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా బెయిల్ పొడిగించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందించనుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.