Modi Hotel Stay: మోదీ వచ్చారు, మా హోటల్ లో బస చేసి వెళ్లారు.. మరి బిల్లు ఎప్పుడు కడతారు?: హోటల్ యాజమాన్యం

Hotel threatens legal action for non settlement of bills of over Rs 80 lakh for Modi Stay
  • వడ్డీతో కలిపి రూ.80 లక్షలు అయిందంటున్న మైసూరు హోటల్ యాజమాన్యం
  • బిల్లు కడతారా కోర్టుకు వెళ్లమంటారా అంటూ అటవీ శాఖకు లేఖ
  • సెటిల్ చేస్తామంటూ హామీ ఇచ్చిన కర్ణాటక అటవీ శాఖ మంత్రి

ప్రధాని నరేంద్ర మోదీ మైసూరు పర్యటనలో తమ హోటల్ లో బస చేశారని, దానికి సంబంధించిన బిల్లు వెంటనే చెల్లించాలంటూ ఓ హోటల్ యాజమాన్యం కర్ణాటక అటవీ శాఖకు లేఖ రాసింది. ఏడాదిగా పెండింగ్ లో ఉన్న ఈ బిల్లు ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.80 లక్షలు అయిందని పేర్కొంది. ఈ మొత్తం వెంటనే చెల్లించకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందంటూ లేఖలో హెచ్చరించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖంద్రె స్పందించారు. ఈ బిల్లు వెంటనే చెల్లిస్తామని హోటల్ మేనేజ్ మెంట్ కు హామీ ఇచ్చారు. 
 
బండిపుర పులుల సంరక్షణ కేంద్రం 50వ వార్షికోత్సవం సందర్భంగా గతేడాది ఏప్రిల్ లో రాష్ట్ర ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రధాని మోదీని ఆహ్వానించింది. ప్రధాని కోసం మైసూరులోని హోటల్ రాడిసన్ బ్లూ ప్లాజాలో వసతి ఏర్పాటు చేసింది. అయితే, దీనికి సంబంధించిన బిల్లు ఇప్పటి వరకు చెల్లించలేదని హోటల్ యాజమాన్యం పేర్కొంది.

ఈ కార్యక్రమాన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్ టీసీఏ), కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇందుకోసం రూ.6.33 కోట్ల నిధులు కేటాయించాయి. ఈ మొత్తంలో ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేసిన ఎన్ టీసీఏ.. మిగతా నిధులు రూ.3.33 కోట్లు ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం ఎన్ టీసీఏ తో సంప్రదింపులు జరుపుతోంది. కార్యక్రమానికి అయిన ఖర్చులను ముందు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే రీయింబర్స్ చేస్తామంటూ ఎన్ టీసీఏ జవాబిచ్చింది. ఈ సంప్రదింపుల కారణంగా రాడిసన్ బ్లూ ప్లాజాలో మోదీ వసతికి సంబంధించిన బిల్లు చెల్లించడంలో ఆలస్యమైందని కర్ణాటక మంత్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News