Chevireddy Bhaskar Reddy: శ్రీమతి నాని గారు నన్ను నానా మాటలు అన్నారు... నేను ఏం చేయాలి?: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

Chevireddy Bhaskar Reddy talks about allegations
  • ఇటీవల తిరుపతిలో పులివర్తి నానిపై దాడి
  • చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు
  • తనపై అనవసరంగా నిందలు వేస్తున్నారన్న చెవిరెడ్డి
  • వాడు, వీడు, రాస్కెల్, వెధవ అని నాని భార్య తిడుతోందని ఆవేదన

ఇటీవల తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. పులివర్తి నాని తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే తప్ప, ఆయన తనకు శత్రువు కాదని స్పష్టం చేశారు. తనపై అనవసరంగా నిందలు వేస్తున్నారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో తాను ఒకరిపై చేయిచేసుకున్నట్టు కానీ, కనీసం చిన్న మాట తిట్టినట్టు కానీ చూపించగలరా అని వ్యాఖ్యానించారు. ఇంతకంటే హుందాగా ఎలా ఉండాలో చెప్పండి అంటూ అడిగారు.  

"నేనేమైనా అమెరికా నుంచి రాత్రికి రాత్రి దిగినవాడ్నా... నాకు ఉద్యమాలు తెలియవనుకుంటున్నారా? నేను కింది స్థాయి నుంచి వచ్చినవాడ్ని... నాపై 88 కేసులు పెట్టారు. నేను అక్రమ దందాలు చేశానని అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా... చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు... నేను అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటే ఆయన చూస్తూ ఊరుకునేవారా? 

మా పార్టీ కోసం, ప్రజల కోసం పోరాటాలు చేశానే తప్ప, టీడీపీ వాళ్లపైనా, వాళ్ల కుటుంబ సభ్యులపైనా ఏనాడూ దాడులు చేయలేదు. మావాళ్లకు న్యాయం జరగాలని పోరాడి అనేకసార్లు జైలుకు వెళ్లానే తప్ప, అక్రమ చర్యలు చేసుంటే చంద్రబాబు నన్ను వదిలిపెట్టేవారా? నన్ను బతకనిచ్చేవారా? 

నేను ఎలాంటి వాడ్నో భగవంతుడికి తెలుసు. ప్రతి రోజూ వాళ్లు (పులివర్తి నాని) ప్రెస్ మీట్లు పెట్టి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎవరో ఒకరు తిడితే ఫర్వాలేదు... ఒకరోజు భార్య తిడితే, మరొకరోజు భర్త తిడతాడు, ఇంకొక రోజు కొడుకు తిడతాడు. చేయగలిగినంత మంచి చేయాలనుకుంటానే తప్ప, ఎవరినీ కించపరచాలనుకోవడం నా నైజం కాదు. 

నాని భార్య నన్ను వాడు, రాస్కెల్, వెధవ, బుద్ధుందా అని మాట్లాడుతుంటే నేను ఏమనాలి? నేను ఎందుకు భరించాలి? ఎప్పుడైనా నేను మిమ్మల్ని ఒక్క మాట అన్నానా? మీ జోలికి వచ్చామా, మీపై కేసులు పెట్టామా? నాని గారు దుర్మార్గంగా తిడతారు... శ్రీమతి నాని గారు కూడా అంతే. 

నా జీవితంలో ఎప్పుడూ ఆడమనిషిపై వ్యాఖ్యలు చేయలేదు. చదువుకునే రోజుల్లో కూడా మహిళలపై అనుచితంగా మాట్లాడలేదు... కానీ నన్ను ఇవాళ వీళ్లు దారుణంగా మాట్లాడుతున్నారు... నేను ఏం చేయాలి?" అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.

  • Loading...

More Telugu News